
కర్నూలు, 02 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మకాయల ధరలు (Lemon prices) ఒక్కసారిగా కొండెక్కడంతో సామాన్యులకు తీవ్ర భారంగా మారింది. రాష్ట్రంలోనే ప్రముఖ మార్కెట్లలో ఒకటైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో నిమ్మ ధరలు భారీగా పెరిగాయి. గత మంగళవారం 80 కేజీల నిమ్మ బస్తా ధర సుమారు రూ.12,000 పలకగా, ప్రస్తుతం అది ఏకంగా రూ.16,000కు చేరుకుంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే బస్తాపై ఏకంగా రూ.4,000 వరకు ధర పెరగడంతో బహిరంగ మార్కెట్లో కిలో నిమ్మకాయలు ఏకంగా రూ.200 వరకు పలుకుతున్నాయి.
వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తోటల్లో నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనికితోడు శ్రావణమాసం సందర్భంగా ఆలయాల్లో పూజలు, శుభకార్యాల నేపథ్యంలో నిమ్మకాయల వినియోగం విపరీతంగా పెరగడంతో డిమాండ్కు సరిపడా సరఫరా లేక ధరలు భగ్గుమంటున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లోనూ కొత్త పంట మార్కెట్లోకి వచ్చే వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV