
మహబూబాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఆన్లైన్లో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్ (29), చింతలచెరువు ప్రశాంత్ (26)లను ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు షేక్ ఇర్ఫాన్ పోలీస్ యూనిఫాం ధరించిన ఫొటోను వాట్సాప్, ట్రూకాలర్లో డీపీగా పెట్టుకున్నాడు. అనంతరం కేసముద్రం మండలానికి చెందిన బంగారు వ్యాపారి బోగోజు వేణుగోపాలచారికి సంబంధించిన ఫోన్ నంబర్ను గూగుల్లో వెతికి తెలుసుకుని ఈ నెల 10న ఫోన్ చేశాడు.
తాను ఏలూరు సమీపంలోని పార్వతీపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐనని పరిచయం చేసుకున్నాడు.ఇద్దరు దొంగలను పట్టుకున్నామని, వారు దొంగతనం చేసిన బంగారాన్ని సదరు వ్యాపారికి విక్రయించారని, అందుకు సంబంధించిన రసీదులు తమ వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కొనుగోలు చేసిన బంగారాన్ని తమకు అప్పగించకపోతే అరెస్ట్ చేస్తామని, పరువు, మర్యాదలు పోతాయని భయపెట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం వాట్సాప్లో క్యూఆర్ కోడ్ పంపి రూ.88,026 ఆన్లైన్లో వసూలు చేసినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..