
మేఘాలయ, 23 సెప్టెంబర్ (హి.స.)
మేఘాలయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (UDP)కి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈశాన్య భారతదేశం మరియు మేఘాలయ అభివృద్ధికి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వీరు బీజేపీలో చేరినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
ఈ చేరికల ద్వారా మేఘాలయ శాసనసభలో రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో లఖ్‌మెన్ రింబుయ్, పియస్ మార్వెయిన్, కిర్మెన్ షిల్లా, మైరాల్‌బోర్న్ సీయెం, మాత్యూ కుర్బా, ఓలన్ సింగ్ సుయిన్, బాలాజీద్ కుపర్ సిన్రెమ్ మరియు సిన్షార్ లింగ్డో థబాహ్ ఉన్నారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ జాతీయ ప్రతినిధి అండ్ ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ సంబిత్ పాత్రల సమక్షంలో వీరికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మొత్తం 60 స్థానాలు ఉన్న మేఘాలయ అసెంబ్లీలో ఇప్పటివరకు బీజేపీకి కేవలం 2 స్థానాలు మాత్రమే ఉండేవి. అయితే, ఈ 8 మంది ఎమ్మెల్యేల చేరికతో బీజేపీ శాసనసభ బలం 10కి పెరిగింది. దీంతో 33 స్థానాలు ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) తర్వాతి స్థానంలో నిలిచి, మేఘాలయ శాసనసభలో బీజేపీ రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు, ప్రాంతీయ పార్టీ అయిన UDP బలం 12 నుండి 4 స్థానాలకు పడిపోయింది.
గత 12 సంవత్సరాలలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు సాధించిన మార్పులు, మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి ఈ ప్రజాప్రతినిధులను తీవ్రంగా ప్రభావితం చేశాయని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi