
ఢిల్లీ , 28 సెప్టెంబర్ (హి.స.)భారత పర్యాటక రంగాన్ని డిజిటల్ వేదికతో మరింత అనుసంధానించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని పర్యాటక సేవలు, ప్రదేశాలు, ప్రయాణ సంబంధిత ఉత్పత్తులు, అనుభవాలను ఒక భాగస్వామ్య డిజిటల్ ఎకోసిస్టమ్లోకి తీసుకురావాలనేదే లక్ష్యం. ప్రస్తుతం పర్యాటకుడు ఒక ప్రదేశాన్ని సందర్శించడానికి వేర్వేరు వెబ్సైట్లు, యాప్లు, ట్రావెల్ ప్లాట్ఫారాలను ఉపయోగించాల్సి వస్తుంది. కొత్త డిజిటల్ మౌలిక వేదిక ద్వారా ఈ సేవలను మరింత సులభంగా కనుగొనే అవకాశం ఉంటుంది. పర్యాటకుల రద్దీ కొద్ది ప్రసిద్ధ నగరాలకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనకు ఈ డిజిటల్ మౌలిక వ్యవస్థ ఉపయోగపడే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్