ములుగు, 13 అక్టోబర్ (హి.స.)
వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొనకుండానే ఇతర శాఖలకు చెందిన మంత్రులు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించడం చర్చనీయ అంశంగా మారింది. మహా జాతర పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నిధులను మంజూరు చేయగా ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల మేడారం చేరుకొని పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయా పనులను వంద రోజులలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయగా సంబంధిత అధికారులు ఆయా పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా గత నాలుగు రోజులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం వెలుగులోకి వచ్చిన సందర్భంగా సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి సంబంధిత మంత్రి కొండా సురేఖ పాల్గొనకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయినది. సోమవారం 12 గంటల సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ల ద్వారా మేడారం చేరుకున్నారు. దీంతో గిరిజన పూజారులు మంత్రులను తమ సంప్రదాయం ప్రకారం గద్దెల ప్రాంతానికి తీసుకుపోయారు. మంత్రులు అమ్మవార్లకు చీర సారె సమర్పించారు. అనంతరం మేడారంలో జరుగుతున్న పనులను వారు పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాకపోవడం ఇతర శాఖలకు చెందిన మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు