రంగారెడ్డి, 13 అక్టోబర్ (హి.స.)
చేవెళ్ల కాంగ్రెస్ పార్టీలో మరోమారు వర్గవిభేదాలు బయటపడ్డాయి. ఈ రోజు చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో డీసీసీ(DCC) అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పరిశీలకులుగా తమిళనాడు ఎంపీ రాబర్ట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై నేతల ప్రసంగం అనంతరం రచ్చ మొదలైంది. మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తనను వేదికపైకి పిలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేయరా అంటూ ప్రశ్నించారు. వేదికపై డమ్మీ బీసీలను కూర్చోబెట్టారంటూ మండిపడ్డారు. పరుష పదజాలంతో దూషణలకు దిగాడు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి సైతం వాదనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇంతకు ఏ పార్టీ, అధికారిక, పార్టీ సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని వాపోయారు. ఆనాడు నీవేం చేశామంటూ శ్రీనివాస్ గౌడ్ పై ధ్వజమెత్తారు. ఈ సమయంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ప్రస్తుత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి స్థానిక సీనియర్ నేతలు కలుగజేసుకొని శాంతింపజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు