హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షుడు శ్రీ ఏటా మధుకర్ గారు ఆత్మహత్యకు గురైన విషాద ఘటన పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీ రాంచందర్ రావు గారు ఈ రోజు మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పోరాడిన ధైర్యవంతుడు మధుకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం, అక్రమ కేసులు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
బిజెపి కార్యకర్తలపై అణచివేత, భయపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ దౌర్జన్యాలే మధుకర్ మృతికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని.. ఏ ఇబ్బంది వచ్చినా పార్టీకి తెలియజేయాలని.. ఎవరూ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడకూడదని రాంచందర్ రావు సూచించారు.
మధుకర్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రామగుండం సీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నేరస్తులను ఎంతటివారైనా గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాంచందర్ రావు గారి వెంట బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ N.V సుభాష్ గారు, శ్రీ భరత్ గారు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు