నల్గొండ,14 అక్టోబర్ (హి.స.)
రైతులు పంటల మార్పిడి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల రైతు వేదికలో మంగళవారం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా రైతులకు వంద శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి, పత్తి సాగు తగ్గించి రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనె గింజలు సాగు చేసే రైతులకు వివిధ రకాల ప్రోత్సాహలను అందిస్తున్నట్లు తెలిపారు. వేరుశనగ రైతులకు అధిక దిగుబడినిచ్చే గుజరాత్ లోని జీజేజీ 32 రకం విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు.
రైతులను ఎంపిక చేసే బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓ)లకు అప్పగించిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే వివిధ రకాల విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు