అమరావతి, 14 అక్టోబర్ (హి.స.) బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం తడిసి ముద్దవుతోంది. ఆదివారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కుంభవృష్టి కురవడంతో నగరం జలమయమైంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
సోమవారం తెల్లవారుజాము నుంచి ఏలూరు జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ విభాగంలోకి వరద నీరు చేరడంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రి సమీపంలోని డ్రెయిన్‌పై సిమెంట్ దిమ్మెలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులు అందులో పడి గాయపడ్డారు. జిల్లాలోని కొయ్యలగూడెం మండలంలో సోమవారం సాయంత్రం 4:30 గంటల వరకు అత్యధికంగా 91.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉండి, పాలకొల్లు, ఆకివీడు, భీమవరం లాంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం వరి పంట ఈనిక దశలో ఉండటంతో ఈ వర్షాలు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోకి భారీగా నీరు చేరడంతో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడు సమీపంలో వేర్వేరుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని, అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV