బెంగళూరు, 14 అక్టోబర్ (హి.స.)కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలపై ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను గనుక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఉంటే, ఈ గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసేవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాల వల్ల ఆర్టీసీ బస్సులు కేవలం మహిళలకే అన్నట్లుగా మారిపోయాయని దేశ్‌పాండే ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దేవుడా.. ధారవాడ, బెళగావి, కలబురగితో పాటు రేణుకా యల్లమ్మ ఆలయానికి వెళ్లే బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో పురుషులు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. బస్సుల్లో పురుషులకు కనీసం సీట్లు కూడా దొరకడం లేదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV