హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు సహా 61 మంది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 'అమిత్ షా దృఢమైన సంకల్పానికి ఇది నిదర్శనం. అమిత్ షా అనుకున్నట్లు 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతం కావడం ఖాయం. అంతర్గత భద్రత పట్ల అమిత్ షా రాజీలేని వైఖరి, దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఆయన మాటలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పడానికి ఈ లొంగుబాటులే నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో శాంతి, భద్రత మరియు అభివృద్ధికి ఇచ్చిన హామీలను సాకారం చేస్తోంది. ఇకనైనా మావోయిస్టులు ఆయుధాలను వదిలి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు నెట్వర్క్ కూలిపోతోంది.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..