నిజామాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు. ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్ లో 4.37 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారని, 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలలో ధాన్యం దిగుబడులు వస్తున్నందున ఇప్పటికే జిల్లాలో 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఈ కేంద్రాలలో ధాన్యం సేకరణ జరిపేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు