మహబూబాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ
మండలం పెగడపల్లి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏసీ గూడ్స్ ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. టాటా ఏసీ గూడ్స్ లో టేకు కలపను తరలిస్తుండగా, ఎదురుగా వస్తున్న ట్రాక్టరు తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో కర్ణగండి గ్రామానికి చెందిన బంగారి వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ట్రాలీ డ్రైవర్ యాప సందీప్ (సాదిరెడ్డిపల్లి గ్రామం) కుడి కాలు విరిగిపోయింది. సమాచారం అందుకున్న కొత్తగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన సందీప్ను మరో ట్రాలీ సాయంతో బయటకు తీసి పోలీసు వాహనంలో అత్యవసర చికిత్స కొరకు నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు