గుంటూరు, ):, 16 అక్టోబర్ (హి.స.)అసోం నుంచి దర్జాగా విమానాల్లో వస్తారు. రైళ్లలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. తిరిగి దర్జాగా విమానాల్లో అసోం వెళ్లిపోతారు. ఇలా పలు రైళ్లలో వరుస చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న.. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గతనెలలో కృష్ణా కెనాల్ వద్ద వరుసగా జరిగిన నేరాలకు సంబంధించి ముఠాలోని ప్రధాన నిందితుడు సంజోయ్‌రాయ్‌తోపాటు హరియాణాలోని హిసార్ పరిధిలోని సత్రోద్ కలాన్‌కు చెందిన సతేందర్‌కుమార్, రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పరిధిలోని బిలోతి కా నార్లా గ్రామానికి చెందిన సతీష్‌గుజ్జర్, సవాయి మాథోపూర్ జిల్లా గంగాపూర్ నగర్‌కు చెందిన రవికుమార్‌ను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, తిరిగి కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకున్నారు.
గుంటూరు పరిధిలో ఈ ముఠాపై 15 కేసులు ఉన్నాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, సికింద్రాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున కేసులు ఉన్నట్లు గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు, సీఐ అంజిబాబు తెలిపారు. కాగా, గుంటూరు రైల్వే పోలీసులిచ్చిన సమాచారంతో చెన్నైలో మరో నిందితుడిని అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ