శ్రీశైలం, 16 అక్టోబర్ (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. తన కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం జరిపించారు. ఆ తర్వాత భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
స్వామి, అమ్మవార్ల దర్శనం పూర్తయ్యాక శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శించారు. అక్కడున్న శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించి, ఛత్రపతి శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ పర్యటనలో ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. శ్రీశైలంలో దర్శనం ముగించుకున్న అనంతరం ముగ్గురు నేతలు కలిసి హెలికాప్టర్‌లో కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV