అమరావతి, 16 అక్టోబర్ (హి.స.) సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కఠిన చర్యలు తప్పవని డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా, దురుద్దేశాలను ఆపాదిస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అనుచిత, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్న కొంతమందిని ఇప్పటికే గుర్తించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించుకోవాలి. మతం, వర్గ, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు, వీడియోలు లేదా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు అనివార్యం అని డీజీపీ స్పష్టం చేశారు. అటువంటి పోస్టులు పెట్టిన వారిని గుర్తించి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. తప్పుడు వార్తలు దుష్ప్రచారం చేసినా కూడా అది నేరమేనని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియా పోస్టుల ద్వారా సమాజంలో ఉద్రిక్తతలు రేపే ప్రయత్నం చేసే వారిపై పలు సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరు ఎంత పెద్దవారైనా, ఏ సంస్థలో పనిచేస్తున్న వారైనా చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరూ మినహాయింపు కాదని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV