
తుర్కియే, 28 అక్టోబర్ (హి.స.) తుర్కియే (టర్కీ)లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. నేటి వేకువజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతోందో తెలియని ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం, ప్రభావితమైన ప్రాంతాల పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందనప్పటికీ, కొన్ని భవనాలకు స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భూకంపం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ప్రారంభించింది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.
భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న తుర్కియేలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. గతంలో కూడా ఇక్కడ సంభవించిన పలు భూకంపాలు తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV