
కర్నూలు, 31 అక్టోబర్ (హి.స.) సమయం ఏదైనా అవకాశం దొరికినప్పుడల్లా చాలా మంది తినేందుకు ఆసక్తి చూపే పండ్లు.. అరటిపండ్లు. ఈ పండు కడుపు నింపుతుంది. పైగా పోషకమైనది. కానీ అరటిపండ్లతో పాటు వంటగదిలో ఉండే మరో మసాలా దినుసు కలిపి తినడం ద్వారా కాలేయ వ్యాధులను తరిమి కొట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నేచర్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. అరటిపండ్లు, మిరియాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి భలేగా పనిచేస్తాయని వెల్లడించింది. దీనిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కొవ్వు కాలేయ సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుత సంజీవని. ఈ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా అరటిపండ్లను మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఫ్యాటీ లివర్ అనేది ప్రాథమికంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మద్యం తాగని వారిలోనూ ఈ రకమైన సమస్య పెరుగుతోంది. ఇటీవల, ఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశంలో 38.6 శాతం మందికి ఈ రకమైన ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది. వృద్ధులతోపాటు యువకులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. చాలా మందికి ఫ్యాటీ లివర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతున్నట్లు వైద్యులు సైతం చెబుతున్నారు. చాలా మంది సకాలంలో ఈ వ్యాధి గుర్తించడం లేదు.
అరటిపండ్లలో విటమిన్ B6, విటమిన్ సి, డోపమైన్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కాలేయంలో పేరుకుపోయిన హానికరమైన పదార్థాలను తొలగిస్తాయి. అంతే కాదు అరటిపండ్లలోని స్టార్చ్ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అరటిపండ్లలోని కరిగే ఫైబర్ పెక్టిన్ పేగులలోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. మిరియాలతో కలిపినప్పుడు అరటిపండ్ల ఈ లక్షణాలు మూడు రెట్లు పెరుగుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV