
కేవాడియా, 31 అక్టోబర్ (హి.స.)భారత మాజీ హోంమంత్రి, ఉక్కు మనిషి బిరుదు పొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవాడియాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు.
సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, ఆయనకు గౌరవ నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన రాష్ట్రీయ ఏకతా దివస్ పరేడ్‌లో ప్రధాని పాల్గొన్నారు. ఈ పరేడ్‌కు గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సిమ్రన్ భరద్వాజ్ నాయకత్వం వహించగా, మహిళా పోలీసు సిబ్బంది ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, “నేను దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కోసం నన్ను అంకితం చేస్తున్నాను. ఈ సందేశాన్ని దేశ ప్రజలందరికీ చేరవేయడానికి ప్రతి ప్రయత్నం చేస్తాను. సర్దార్ పటేల్ కృషితో ఏర్పడిన ఐక్యతా భావాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను” అని ప్రతిజ్ఞ చేశారు. “భారతదేశ సమైక్యతకు పునాది వేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు జాతి గౌరవంతో నివాళి అర్పిస్తోంది. ఆయన చూపిన సుశాసనం, ప్రజా సేవా దృక్పథం తరతరాల భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఐక్య, బలమైన, స్వావలంబన భారతదేశం కోసం ఆయన దృష్టిని సాకారం చేయడమే మన సంకల్పం” అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV