అమరావతి, 5 అక్టోబర్ (హి.స.)
దేవీపట్నం, : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, గోదావరి ముంపు నేపథ్యంలో గండిపోశమ్మ స్వయంభూ ఆలయ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ అధికారులు ఇటీవల కర్ణాటకలోని కూడలి సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడా అదే తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరగనున్నాయి. అమ్మవారి స్వయంభూ ఆలయం దిగువ నుంచి పైవరకు చుట్టూ కాంక్రీటు గోడతోపాటు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మెట్ల మార్గంలో పైకి వచ్చి, అక్కడి నుంచి రోప్‌వే ద్వారా ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపైకి చేరుకుంటారు. కొండపైకి చేరుకున్న భక్తులు పోలవరం ప్రాజెక్టు అందాలు, పాపికొండల పర్యాటక ప్రాంతం, 1100 మెగావాట్లతో నిర్మితమవుతున్న జలవిద్యుత్తు కేంద్రాన్ని సందర్శించి కొత్త అంగుళూరు ప్రాంతానికి చేరుకుంటారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ