విజయవాడ, 6 అక్టోబర్ (హి.స.) : గిరిజన బిడ్డల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. గిరిజన బిడ్డలు ఏం తింటున్నారో చూసే పర్యవేక్షణ ఈ ప్రభుత్వానికి అసలే లేదని విమర్శించారు. సంక్షేమ బడుల్లో తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా లభించడం లేదని చెప్పుకొచ్చారు. గిరిజన బిడ్డల కడుపునకు బుక్కెడు అన్నం పెట్టడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గిరిజన బిడ్డల సంక్షేమం పట్టదా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత నీరు తాగి ఇద్దరు విద్యార్థినులు మరణించిన ఘటనపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు. పాలన వైఫల్యంతో ముక్కుపచ్చలారని బిడ్డలను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 128 మంది గిరిజన బిడ్డలు ఆస్పత్రుల పాలయ్యారంటే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు. చనిపోయిన బిడ్డల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV