హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)
మహిళల వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు సైతం దాయాదితో నో హ్యాండ్ షేక్ విధానాన్ని అనుసరించింది. గ్రూప్ దశ రెండో మ్యాచ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా తో హర్మన్ ప్రీత్ కౌర్ కరచాలనం చేయలేదు. ఆమెను అసలు పట్టించుకోలేదు కూడా. టాస్ తర్వాత రిఫరీతో మాట్లాడి వెళ్లిపోయింది భారత సారథి. అంతేకాదు టాస్ సమయంలో గందరగోళం ఏర్పడినా సరే గొడవ చేయకుండా సరేలే అని హుందాగా ప్రవర్తించింది హర్మన్షీత్.
వరల్డ్ కప్ ఆరంభ పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించిన భారత జట్టు ఆదివారం పాకిస్థాన్ను ఢీ కొడుతోంది. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో జరుగతున్న మ్యాచ్లో పాక్ క్రికెటర్లతో హ్యాండ్ షేక్ చేయొద్దని బీసీసీఐ (BCCI) ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. హర్మన్ ప్రీత్ దాయాది జట్టు నాయకురాలైన ఫాతిమా సనాతో కరచాలనం చేయలేదు. అంతేకాదు.. టాస్ సమయంలోనూ పెద్ద గందరగోళం ఏర్పడింది.. ముందుగా పాక్ సారథి ఫాతిమ టెయిల్స్ అని చెప్పింది.
కానీ, రిఫరీ షాంద్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్కు మాత్రం ఆమె హెడ్స్ అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. తీరా హెడ్స్ పడగానే ఫాతిమా టాస్ గెలుపొందినట్టు రిఫరీ చెప్పింది. అయినా సరే హర్మన్ ప్రీత్ కౌర్ అభ్యంతరం చెప్పలేదు. ఈ ఒక్క సంఘటనతో తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్న భారత కెప్టెన్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు