అమరావతి, 6 అక్టోబర్ (హి.స.) పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్ మేరకు పీజీ ఇన్-సర్వీస్ కోటాలో 20 శాతం సీట్లను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. డీహెచ్ కార్యాలయంలో ఆందోళనలో ఉన్న పీహెచ్‌సీ వైద్యుల సంఘం నేతలతో ఆదివారం ఆయన చర్చించారు. వైద్యుల టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, ఇతర సర్వీస్ వ్యవహారాల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. ఇన్ సర్వీస్ కోటా సీట్లను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతామని, ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని వెల్లడించారు. వెంటనే వైద్యులంతా విధుల్లో చేరాలని కోరారు. అయితే, 20 శాతం రిజర్వేషన్‌ను 2030 వరకూ కొనసాగించాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించనందున ఆందోళనలు యథావిధిగా కొనసాగిస్తామని వైద్యులు ప్రకటించి అక్కడ నుంచి నిష్క్రమించారు. వైద్యుల తీరు పట్ల కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే 20 శాతం సీట్ల కేటాయింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తదుపరి సంవత్సరాల్లో ఈ కోటాను ఎలా అమలుచేయాలన్న దానిపై సమగ్రంగా అధ్యయనం చేసి, విధానపరమైన నిర్ణయాన్ని వచ్చే నెలలోగా తీసుకుంటుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ