పత్తికొండ, 6 అక్టోబర్ (హి.స.) . కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో. టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పండగ ముందు వరకు కిలో రూ.8 నుంచి 10 పలకగా.. ఆదివారం మాత్రం ఒక్కసారిగా రూ.4కు పడిపోయింది. దీంతో ఆరుగాలం పడించిన పంటను రైతులు రోడ్డుపై పారబోశారు. మార్కెట్ కమీషన్‌తో పాటు కోత కూలీలు, రవాణా ఖర్చులు చెల్లించామని.. లాభం సంగతి పక్కనపెడితే కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
టమాటాలు అన్నీ రోడ్డుపై పారబోసి.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుత్తి-మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్ ఏర్పడటంతో వాహనదారులు గందరగోళపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతలు డిమాండ్ చేశారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా త్వరగానే పూర్తి చేయాలని అన్నారు. 10 కిలోల టమాటా గంపలు రెండింటికి కలిపి కేవలం రూ.80 నుంచి రూ.100 మధ్య ధర పలికిందని, మార్కెట్లో వ్యాపారులు 25 కిలోల గంపలను రెండింటిని రూ.180 కనిష్ఠ ధరకు కొన్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV