తెలంగాణ, నల్గొండ. 8 అక్టోబర్ (హి.స.)
నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లో విద్యుదాఘాతం కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడంతో బ్యాంకులో ఉన్న ప్రధాన కంప్యూటర్లు, ఏసీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి మంటలను ఆర్పివేశారు. మంటల్లో ఎలక్ట్రానిక్ వైర్లు పూర్తిగా తగలబడిపోయాయి. వీటితో పాటు కంప్యూటర్లు ఇతర ముఖ్యమైన పత్రాలు కాలిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ విషయం పై బ్యాంకు ప్రధాన కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ఏసీ మిషన్ ద్వారానే షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారుల అంచనా. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు