తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి. 8 అక్టోబర్ (హి.స.)
మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం
ముందు బుధవారం గిర్మాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గిర్మాపూర్కు బస్సు సౌకర్యం లేక రాయిలాపూర్, గిర్మాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం కల్పించాలని మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ను కోరగా తమ ఊరికి రోడ్డు సౌకర్యం సరిగా లేదని అందుకే బస్సులు నడపడం లేదని సమాధానం చెప్పాడని తెలిపారు. బస్సు సౌకర్యం లేక గిర్మాపూర్లోని పాల్ టెక్నిక్ కాలేజీలో చదివే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై మున్సిపల్ కమిషనర్కు గిర్మాపూర్కు వెళ్లే రోడ్డు బాగు చేయించాలని ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసినా స్పందించలేదన్నారు. వారం రోజుల్లో రోడ్డు పూర్తి చేయకపోతే రాయిలాపూర్, గిర్మాపూర్ గ్రామాల ప్రజలందరూ పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు