విశాఖ, గుంటూరు నగరాల్లో ఐటీ దాడులు
గుంటూరు, 9 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. కందిపప్పు కమీషన్ ఏజెంట్ వెంకటేశ్వరరావు నివాసం, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టా
విశాఖ, గుంటూరు నగరాల్లో ఐటీ దాడులు


గుంటూరు, 9 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. కందిపప్పు కమీషన్ ఏజెంట్ వెంకటేశ్వరరావు నివాసం, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కందిపప్పు సరఫరా కాంట్రాక్టు పొందిన వెంకటేశ్వరరావు భారీ స్థాయిలో వ్యాపారం చేసి కూడా ఆదాయ పన్నులు చెల్లించలేదని అధికారులు గుర్తించారు. ఆయన గత 30 ఏళ్లుగా కమీషన్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం కూడా చేస్తున్నట్లు సమాచారం.

సోదాల విస్తరణ

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బంగారు బిస్కెట్ల వ్యాపారులపై జరిపిన సోదాల్లో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన ఏజెంట్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు అప్రమత్తమై విజయవాడ ఐటీ దర్యాప్తు విభాగం ఆధ్వర్యంలో 30 బృందాలను ఏర్పాటు చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, వినుకొండ ప్రాంతాల్లోని దాల్ మిల్లులు, ఏజెంట్ల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు చేపట్టారు.

చిట్టీల వ్యాపారం వెలుగులోకి

గుంటూరు దర్గారోడ్డులోని వెంకటేశ్వరరావు ఫ్లాట్‌లో జరిగిన తనిఖీల్లో ఐటీ అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. కందిపప్పు, పచ్చిపప్పు వ్యాపారాలతో పాటు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల విలువైన చిట్టీలు కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో భాగస్వాముల పేర్లు, లావాదేవీల వివరాలను ఐటీ బృందాలు సేకరిస్తున్నాయి.

రాష్ట్రాల వారీగా విచారణ

వెంకటేశ్వరరావు నుంచి సరుకులు కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మిల్లర్లు ఎవరు? ఎంతమేరకు లెక్కల్లో చూపారనే అంశాలపై అధికారులు సమగ్ర పరిశీలన చేస్తున్నారు. త్వరలోనే ఆ మిల్లుల ఖాతా పుస్తకాలు, జీఎస్టీ రికార్డులు తనిఖీ చేయనున్నారు.

బినామీలు, ఆస్తుల జాబితా సేకరణ

కమీషన్ ఏజెంట్లు బ్యాంకుల్లో జరిపిన లావాదేవీలు, లాకర్లలో భద్రపరచిన బంగారం, వెండి, ఆస్తుల వివరాలు సేకరించారు. వీరికి బినామీలుగా ఉన్నవారి వివరాలను కూడా రాబట్టారు. సోదాల్లో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.

వైజాగ్ ఏజెంట్‌పై కూడా సోదాలు

విశాఖపట్నంలోని మరో కమీషన్ ఏజెంట్ ఇంట్లోనూ అధికారులు దాడులు చేశారు. అతడు నాలుగు అంతస్తుల భవనంలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ, రూ.1-2 లక్షల విలువైన శుభలేఖలను ముద్రిస్తున్నట్లు గుర్తించారు. అలాగే అతడు బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు, సిమెంటు, ఫర్నీచర్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నట్లు తేలింది.

అంతేకాక ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం పనిచేస్తున్న వారికి పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యాపారాల్లో ఎంతమేరకు జీఎస్టీ, ఐటీ రిటర్నులు సమర్పించారనే దానిపై సమగ్రంగా విచారణ కొనసాగుతోంది. ఈ సోదాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande