
అమరావతి, 20 నవంబర్ (హి.స.)విజయవాడ, ఏలూరుల్లో పట్టుబడిన మావోయిస్టుల్లో 43 మందికి వేర్వేరు కోర్టులు రిమాండ్ విధించాయి. మరో నలుగురికి వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని న్యాయాధికారి ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. నిడమానూరులో పట్టుకున్న నలుగురినీ పటమట పోలీసులు నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు.
వారికి వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి యు. రామ్మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు. వారిని నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. కొత్త ఆటోనగర్‌లో చిక్కిన 28 మందిని పెనమలూరు పోలీసులు ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వారిలో 24 మందికి డిసెంబరు 2 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి జి.లెనిన్‌బాబు ఆదేశాలు ఇచ్చారు. వారిని రెండు బస్సుల్లో రాజమండ్రి కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ