
అమరావతి, 20 నవంబర్ (హి.స.)రాష్ట్రంలో వరి పంట కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది క్రమంగా బలపడి తుపాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలు ఇవ్వడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం 22న ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుంది. అయితే, ఇది తుపాన్‌గా మారుతుందా? లేదా? అనే దానిపై ఐఎండీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈనెల 25 తర్వాత బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడి దక్షిణ కోస్తాలో తీరం దాటే అవకాశం ఉంది.
మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా మన్యం ఏజెన్సీ గజగజ వణికిపోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో బుధవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 5.8 డిగ్రీలుగా నమోదైంది. ఈ చలి ప్రభావం మరో రెండు, మూడు రోజులు కొనసాగి ఆ తర్వాత తగ్గుతుందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV