
ఢిల్లీ, 7 నవంబర్ (హి.స.)వందేమాతరం మన అస్తిత్వపు సంకేతం. ఆనాటి స్వాతంత్య్ర సంగ్రామంలోనైనా... నేడు వికసిత భారతంలోనైనా వందేమాతరం మనకు జీవనోదయం..! సత్యోదయం..!
దేశవ్యాప్తంగా వందేమాతరం ఆలాపన
మనమంతా బ్రిటిష్ వలస పాలనలో ఉన్న కాలంలో గాడ్ సేవ్ ద కింగ్ భారత జాతీయ గేయంగా ప్రకటించాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఆ సందర్భంలో ప్రముఖ బెంగాలీ రచయిత, ఆధునిక సాహితీ సామ్రాట్‌గా పేరుపొందిన బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ మాతృభూమిని స్తుతిస్తూ, నమస్కరిస్తూ, మాతృమూర్తితో పోలుస్తూ, ప్రతి అక్షరంలో దేశభక్తిని నింపుతూ రెండు పాదాలతో వందేమాతరం గేయాన్ని 1875 నవంబర్ 7న బెంగాలీలో రచించారు. వందేమాతర గేయానికి ప్రస్తుతం 150 ఏళ్లు. ఈ సందర్భంగా వందే మాతరం వేడుకలను దేశవ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలతో పాటు, 150 ప్రముఖ స్థలాల్లో, 150 మంది గాయకుల సమక్షంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. నవంబర్ 7న ఉదయం 10 గంటలకు వందేమాతరం అన్ని విద్యాసంస్థల్లో సామూహికంగా ఆలపించనున్నారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస, దేశభక్తి పాటల పోటీల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వివక్షకు వ్యతిరేకంగా పుట్టిన గేయం
బ్రిటిష్ ప్రభుత్వం కింద డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్న బంకించంద్ర... ఓ సందర్భంలో వివక్షకు లోనవుతాడు. నాలాంటి వ్యక్తికే ఇన్ని అవమానాలు జరిగితే సామాన్య భారతీయుడి పరిస్థితి ఏంటనే ఆవేదనతో, ఆలోచనతో, బలమైన దేశభక్తి సంకల్పంతో రాసిన, బ్రిటిష్ సామ్రాజ్యంపై సమర శంఖం పూరించిన వజ్రాయుధం వందేమాతరం. 1777లో బ్రిటిష్ వాళ్ల పైన పోరాడిన సన్యాసుల జీవితాల గురించి రాసిన ‘ఆనంద మఠ్’ నవలలో వందేమాతర గీతాన్ని ఆరు పాదాలతో ఉపయోగించారు. ఆ నవల విశేష పాఠకాదరణ పొందినప్పటికీ, వందేమాతరం కవిత పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ గేయంలోని స్ఫూర్తిని, రచనలోని తాత్వికతని అర్థం చేసుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ గీతాన్ని పఠించడంతో అప్పటి నుంచి వందేమాతరం ఉదయించడం మొదలెట్టింది.
దేశభక్తికి, జాతి స్ఫూర్తికి ఇది పునాది.. ‘వందేమాతరం గీతం ఒక మంత్రంలా ఉంది. ఇది స్వార్థం లేకుండా, జీవితాన్ని దేశభక్తితో అర్పించిన బంకించంద్ర అద్భుత రచన. దేశభక్తి భావాలకు, జాతి స్ఫూర్తికి ఇది పునాదిగా నిలిచింది’ అంటారు అరవింద యోగి. బ్రిటిష్ వారు విభజించు- పాలించు వ్యూహంతో హిందువుల-ముస్లింల ఐక్యత దెబ్బ తీయాలనుకున్నారు. 1905 బెంగాల్ విభజన సందర్భంలో వందేమాతరం మన జాతి ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది. ఓ విప్లవ గీతంగా, సమర నినాదంగా, నిరసన గీతమై ‘వందేమాతరం’ బ్రిటిష్ వాళ్లపై యుద్ధం చేసింది. యావత్ భారత జాతిలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించింది. అప్పటినుంచీ... స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన ప్రతీ కార్యక్రమంలో, ఉద్యమంలో కుల మతాలకతీతంగా ప్రజలంతా వందేమాతరం ఆలపిస్తూ, మనలోని బలమైన స్వాతంత్ర కాంక్షను తెలియజేశారు. అన్ని భాషల్లో వందేమాతరంను అనువదించి కరపత్రాలుగా మార్చారు. స్వాతంత్ర పోరాట యోధులు వందేమాతరాన్ని జైలు జీవితాల్లో కూడా ఆలపించి తమ ధైర్యాన్ని ప్రదర్శించారు. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం వందేమాతర గీతాలాపనను నిషేధించింది.
జాతీయ గీతంతో సమాన స్థాయి వందేమాతరాన్ని జాతీయగీతంగా ప్రకటించాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ... అప్పట్లో కొందరు ముస్లిం నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అయితే పాటలోని మొదటి రెండు పాదాలు ఏ మతానికి వ్యతిరేకం కాదని స్వయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ స్పష్టం చేశారు. 1947 స్వాతంత్ర గాలులు ప్రతి భారతీయుడి శ్వాసగా మారిన సందర్భంలో మన విజయ గీతంగా ఆకాశవాణిలో వందేమాతరం వినిపించింది. 1950 రాజ్యాంగ పరిషత్ సమావేశంలో వందేమాతరం గేయానికి సముచిత స్థానం ఇస్తూ, రవీంద్రుడి జనగణమన జాతీయ గీతంతో సమాన స్థాయి హోదాను కల్పించారు.
అంతర్జాతీయంగా వందేమాతరానికి రెండో స్థానం 2002లో బీబీసీ వరల్డ్ సర్వీస్ అన్ని కాలాలలోనూ అత్యంత ప్రసిద్ధి చెందిన పది పాటలలో అంతర్జాతీయ స్థాయిలో వందేమాతరం రెండవ స్థానాన్ని పొందింది. మహాత్మా గాంధీ వందేమాతరాన్ని దేశాభిమానం, జాతి ఐక్యతకు ప్రేరణగా ఉన్న అద్భుత గీతం అని భావించారు. ఈ పాటలోని భావాలను తను స్వాధీనం చేసుకుని స్వాతంత్ర్య సంగ్రామంలో అహింసా మార్గాన్ని కొనసాగించారు. ప్రజలలో జాతి పట్ల ప్రేమ, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించారు. వందేమాతరం సుజలాం సుఫలాం అన్న ఈ రెండు పాదాల గేయం.. ప్రతి భారతీయుడి గుండె గోళంలో జాతీయ జెండాను ఎగరేస్తూ.... సగర్వంగా ఇంకా కొన్ని శతాబ్దాల పాటు మన రక్తనాళాల్లో ప్రవహిస్తూనే ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV