
ఢిల్లీ 11 డిసెంబర్ (హి.స.) అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ (Pakistan) వైమానిక దాడులకు పాల్పడటాన్ని భారత్ (India) తీవ్రంగా ఖండించింది. చిన్నారులు, మహిళలు, క్రికెటర్లపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలను భారత్ గౌరవిస్తుంది. అమాయకులైన పౌరుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చాలా ఏళ్లుగా బలహీన పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలపై ఇలాంటి దాడులు చేయడం సరికాదు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న అఫ్గాన్ (Afghanistan)పై బహిరంగ బెదిరింపులు, యుద్ధచర్యలు వంటివి అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని అన్నారు. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను తాము సమర్థిస్తున్నామని ఉద్ఘాటించారు. అక్కడి భద్రతా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ