
ముంబై, 11 డిసెంబర్ (హి.స.) పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా సెబీ నుంచి 5 కంపెనీలకు అనుమతి లభించింది. జాబితాలో లీప్ ఇండియా, ఎల్‌డొరాడో అగ్రిటెక్, మోల్బియో డయాగ్నోస్టిక్స్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, ఫుడ్‌లింక్ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్(ఇండియా) చేరాయి. నిధుల సమీకరణకు వీలుగా ఈ కంపెనీలన్నీ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, స్కై అల్లాయ్స్ అండ్ పవర్ వెనకడుగు వేశాయి. ఈ నెల మొదట్లో సెబీ నుంచి ఐపీవో పత్రాలను వాపస్ తీసుకున్నాయి. వీటిలో ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ తాత్కాలికంగానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో రౌండ్‌లో భాగంగా కంపెనీ ఇటీవల రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్‌పై సవరించిన ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
పబ్లిక్ ఇష్యూలో భాగంగా సప్లైచైన్ అసెట్ పూలింగ్ కంపెనీ లీప్ ఇండియా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. దీంతో లిస్టింగ్ ద్వారా రూ. 2,400 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ