
న్యూఢిల్లీ, 14 డిసెంబర్ (హి.స.)
బీజేపీ చేస్తున్న 'ఓట్ చోరీ'ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు ఖండించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీ లోని రామ్ లీలా మైదాన్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో 'ఓట్ చోరీ'కి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలన్నారు.
కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ ను బీజేపీ తమ తాబేదారిగా మార్చుకుని వారికి వ్యతిరేకంగా ఓటు వేసేవారి ఓట్లను తొలగించడం దుర్మార్గమని అన్నారు. బీజేపీ ఎలా ఓటు చోరికి పాల్పడుతుందో ఇప్పటికే తమ అధినేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు వివరించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 'ఓటు చోరీ' వ్యతిరేకంగా చేపట్టిన సంతకాలతో ఇవాళ ఢిల్లీలో ర్యాలీ జరుగుతోందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి 'ఓటు చోరీ'పై లక్షలాది సంతకాల సేకరణ చేసి ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి భారత రాష్ట్రపతికి పంపుతామని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..