
మంగళగిరి, 15 డిసెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ (APSPHCL) చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాస రావు (Kalyan Siva Srinivasa Rao) నియమితులైన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన కార్పొరేషన్ చైర్మనుగా బాధ్యతలను సోమవారం స్వీకరించారు.
మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం పక్కన ఉన్న ప్రైమ్ హిల్స్ చెస్ట్ లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఆయన ఆహ్వానం మేరకు హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య ఆహ్వానితులుగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. జనసేన పార్టీ ప్రొగ్రాం కమిటీ చైర్మనుగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బాధ్యతలను చేపట్టారు. హోం మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణం శివ శ్రీనివాస రావు మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రిలకు ధన్యవాదాలను తెలియజేశారు. తనకు సహకరించిన ప్రతిఒక్కరిని గుర్తంచుకుంటానని అన్నారు. వారి మేలు మరువలేనిదని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వర్తిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కళ్యాణ శివ శ్రీనివాస రావుకు శుభాకాంక్షలను తెలియజేశారు. పోలీసు శాఖ పౌర సేవలో అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. వారి సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV