
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా మూడవ మరియు అఖరి విడత పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గ పరిధిలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి గ్రామంలో తమ అభ్యర్థుల తరఫున ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని పార్టీ కేడర్లో జోష్ను నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మహబూబ్నగర్లోని అడ్డాకుల మండల పరిధిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున ఏ ఒక్క వార్డు మెంబర్ గెలిచినా.. అభివృద్ధి పనుల కోసం తన వద్దకే రావాలన్నారు. అలా అయితే ఒక్క పని కూడా జరగదని.. ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయాలన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. వారిని తన క్యాంపు కార్యాలయంలోకి రాకుండా మెడబట్టి బయటకు గెంటేస్తానని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి.. పార్టీలకు అతీతంగా ప్రజా సేవకు అంకితం కావాల్సిన ఎమ్మెల్యే ఇలా నోరు పారేసుకోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..