
నెల్లూరు 15 డిసెంబర్ (హి.స.)నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన రాజీనామా లేఖను ఆదివారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా క్యాంపు కార్యాలయానికి పంపారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు క్యాంపు కార్యాలయంలో ఆయన చెప్పిన అధికారికి లేఖను అందజేసినట్లు ఆమె భర్త జయవర్ధన్ వెల్లడించారు. అనంతరం అదే లేఖను మీడియా ప్రతినిధులకు విడుదల చేశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
గత ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరులోని 54 కార్పొరేషన్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఎస్టీ జనరల్ కేటగిరీలో భాగంగా ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో ఆమె భర్త జయవర్ధన్ అవినీతి బాగోతం బట్టబయలయ్యాక అతను రెండు పర్యాయాలు జైలు జీవితం గడిపారు. ఆమె పదవి నాలుగేళ్లు పూర్తికావడంతో ఇటీవల అవిశ్వాసం పెడుతూ కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు. ఆమెను పదవి నుంచి దించాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 18న అవిశ్వాసం పెడుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తనకు బలం లేదని గ్రహించిన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కలెక్టర్‌కు పంపిన లేఖను ప్రభుత్వం ఆమోదించడంతో ఆమె శకం ముగిసినట్లయింది. కాగా, 18న జరగాల్సిన అవిశ్వాస సమావేశం సాధారణ సమావేశంగా జరుగుతుందని కార్పొరేషన్‌లోని కొందరు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ