
అమరావతి, 18 డిసెంబర్ (హి.స.)
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,236మందికి పరీక్షలు నిర్వహించగా 1,806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 15మంది మరణించారు. అయితే వారు చనిపోవడానికి కారణం స్క్రబ్ టైఫస్ తో పాటు ధీర్ఘకాలిక వ్యాధులు ఉండటమేనని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 444 కేసులు నమోదయ్యాయి. కాకినాడలో 183, విశాఖలో 143, వైఎస్ఆర్ కడప జిల్లాలో 118, నెల్లూరు జిల్లాలో 113, విజయనగరంలో 96, తిరుపతిలో 90, గుంటూరులో 85, అనంతపురం జిల్లాలో 83 కేసులు నమోదయ్యాయి.
స్క్రబ్ టైఫస్ కారణంగా ఎక్కువగా మూడు మరణాలు పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే పశువులు ఆవాసం ఉండే చోట చిగ్గర్ మైట్ అనే క్రిమి మనుషులను కుట్టడం ద్వారా స్క్రబ్ టైఫస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. పల్లెల్లోనే వీటి కేసులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కీటకం కుట్టిన దగ్గర నల్లటి మచ్చ ఏర్పడటంతో పాటు వ్యాధి లక్షణాలు మలేరియాను పోలి ఉంటాయని చెబుతున్నారు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రమాదం నుండి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV