
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినీ నటుడు, తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. భీమవరం పట్టణంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద గత 12-04-2024 తేదీన కృష్ణ అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చినప్పటికీ, అదే అధికారులు ఇప్పుడు దానిని అనధికార విగ్రహంగా పేర్కొంటూ తొలగించేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
తాజాగా మున్సిపల్ అధికారులు కృష్ణ అభిమానులకు 24 గంటల్లో విగ్రహాన్ని తొలగించాలి అంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా అనుమతులు తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, అదే అధికారులు ఇప్పుడు నిబంధనల పేరుతో తొలగించేందుకు ప్రయత్నించడం అన్యాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణ విగ్రహం తొలగింపునకు వ్యతిరేకంగా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు అన్ని సినీ హీరోల సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న అభిమాన గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని విగ్రహాన్ని తొలగించకూడదని డిమాండ్ చేశారు. విగ్రహం ప్రజాభావోద్వేగాలతో ముడిపడి ఉందని, దీనిని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ