
అనంతపురం, 21 డిసెంబర్ (హి.స.)జిల్లా ఎస్పీ పి. జగదీష్ (SP Jagadeesh) ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మెరుపు తనిఖీలు, ఫ్రిస్కింగ్ ఆపరేషన్లు (Frisking Operations) నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో సీఐలు, ఎస్సైల నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగాయి. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులు, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రద్దీ ప్రదేశాలలో నిఘాను ముమ్మరం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ఉండేలా జిల్లా సరిహద్దుల్లో కూడా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఉంచింది.
గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడంతో పాటు ప్రజల భద్రతను మెరుగుపరచడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని పోలీసు అధికారులు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాలలో అనుమానాస్పదంగా కనిపించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జిల్లాలో ఇటీవల గంజాయి స్మగ్లింగ్ ఉనిక బయటపడిన నేపథ్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రణాళకబద్ధంగా చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతలు, ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV