
అమరావతి, 21 డిసెంబర్ (హి.స.)
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నేతలు జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. అన్నగారిగా సంబోధించకుండా శుభాకాంక్షలు తెలిపారు. “వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని సందేశంలో పేర్కొన్నారు. కాగా, పవన్, షర్మిల ట్వీట్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV