
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.) పోలీస్ డిపార్ట్మెంట్లో పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరుగురు ఐపీఎస్లను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG) స్థాయికి ఎంపానెల్ చేస్తూ ప్రమోట్ చేసింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎన్. శ్వేత, ఆర్. భాస్కరన్, జి. చందన దీప్తి, కల్మేశ్వర్ శింగెనవర్, ఎస్.ఎం. విజయ్ కుమార్, రోహిణి ప్రియదర్శిని ఉన్నారు. ఎన్. శ్వేత హైదరాబాద్ సిటీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ , ఆర్. భాస్కరన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్ ఇంటెలిజెన్స్)గా కొనసాగనున్నారు. ఇక జి. చందన దీప్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రైల్వేస్, సికింద్రాబాద్)గా, విజయ్ కుమార్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వర్తిస్తారు. అయితే, పదోన్నతులు పొందిన వారంతా 2026 జనవరి 1 నుంచి చార్జ్ తీసుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు