
తిరుపతి, 26 డిసెంబర్ (హి.స.)
మనుషులందరికీ సౌక్యం.. సదుపాయాలు కావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ లో భగవత్ ప్రసంగిస్తూ శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయన్నారు. సుఖం అనేది కేవలం భౌతికపరమైనది కాదని స్పష్టం చేశారు. సుఖం అనేది కేవలం మానసికపరమైనదని తెలిపారు. సుఖదు:ఖాలు తాత్కాలికమైనవని పేర్కొన్నారు. మనం పొందుతున్న సౌక్యం, సదుపాయాల్లో రెండో కోణం కూడా ఉంటుందన్నారు. మనమంతా ఈ విశ్వాసానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు. మానసికంగా సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదన్నారు. క్షమా గుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుందన్నారు. కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
అర్థ శాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎన్నో నిర్వచనాలు ఇచ్చారని పేర్కొన్నారు. కానీ చాణక్యుడి అర్థశాస్త్రం ప్రజల సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ప్రతిఒక్కరూ స్వయంగా కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. విజ్ఞాన శాస్త్రం, ధర్మ శాస్త్రాల మధ్య వైరుధ్యమేమి లేదన్నారు. అనుభవంతో ఎంతో విజ్ఞానాన్ని సంపాదిస్తామన్నారు. అనుభవం పాఠాలను కూడా నేర్పిస్తుందన్నారు. సరైన మార్గంలో పయనిస్తే ఏదైనా సాధ్యమని స్వామి వివేకానంద వంటి వారు బోధించిన విషయాన్ని నొక్కి చెప్పారు. మనం వెళ్లేదారి సరైనదిగా ఉండాలని స్పష్టం చేశారు. మార్గం సరైనదైతే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు మార్గాన్ని కూడా ముందుగానే నిర్దేశించుకోవాలని సూచించారు. ప్రపంచ వేగంగా ముందుకెళ్తోన్న తరుణం పోటీ పడాలంటే సాధన ఎంతో అవసరం అన్నారు. సాధన చేసేందుకు ఏకాగ్రత తప్పనిసరని తెలిపారు. వ్యక్తులకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అలవడాలన్నారు. నియంత్రణతో ఏ పనైనా సులువుగా సాధించొచ్చని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV