
ఢిల్లీ26,డిసెంబర్ (హి.స.)భారత్: దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ-టెస్ట్ ప్రక్రియ ముగిసింది. జనగణన తొలి విడతలో భాగంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలోని ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. దీన్ని ‘గృహాల లిస్టింగ్, గణన’ ప్రక్రియ అంటారు. యావత్ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి? ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి? మానవ వనరులను ఎలా మోహరించాలి? అనే దానిపై ప్రీ-టెస్ట్‌లో ముమ్మర కసరత్తు చేశారు. పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుసరించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ఉప జిల్లాల స్థాయిలోని అధికార వర్గాలతో లోతుగా చర్చించారు. ఇళ్ల సమాచారాన్ని సేకరించడానికి లక్షలాది మానవ వనరులను మోహరించడంపైనా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని అధికార వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు ప్రారంభంలోనే ప్రీ-టెస్ట్ ముగిసిందని తెలిపాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ