
వేములవాడ, 28 డిసెంబర్ (హి.స.)
మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న వేళ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తుల సందడి మొదలైంది. గత 15 రోజులుగా వేలాది మంది భక్తుల రాకతో రాజన్న- భీమన్న ఆలయాలు రద్దీగా మారుతున్నాయి. అయితే ఆదివారం అష్టమి భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయం మాత్రం రద్దీగా మారింది. వేకువజాము నుండే మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదిలా ఉండగా భక్తుల రద్దీ కారణంగా ఈ నెల 28 తో పాటు జనవరి 4, 11, 18 తేదీల్లో భీమన్న ఆలయంలో 24 గంటల పాటు భక్తులకు దర్శనాలు కల్పించనున్నామని, అలాగే ఈనెల 29వ తేదీన బద్ది పోచమ్మ ఆలయం 24 గంటల పాటు తెరిచి ఉంటుందని ఆలయ ఈ.ఓ రమాదేవి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు