
వడిశలేరు, 28 డిసెంబర్ (హి.స.)
గ్రామీణ క్రీడలు మన సంప్రదాయాలు.. సంస్కృతికి ప్రతీకలని రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వడిశలేరులో వార్షిక ఎడ్ల బళ్ల (Bullock) పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గన్నివారి తోటలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆవరణలో పోటీలను నిర్వహిస్తున్నారు. కాలేజీ చైర్మన్ గన్ని భాస్కర రావు ఆధ్వర్యంలో గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ పోటీలకు మంత్రి దుర్గేశ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. 7వ వార్షికోత్సవ ఎడ్ల బళ్ల పోటీలు, గుర్రాల పరుగు పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే క్రీడలు ప్రకృతి, పశు సంపద, వ్యవసాయంతో అనుబంధం కలిగి ఉంటాయన్నారు. అవి మన సంస్కృతి, సంప్రదాయాలను అద్దం పడతాయన్నారు. అంతేకాకుండా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భావి తరాలకు గ్రామీణ జీవన సౌందర్యాన్ని అందజేసే మాధ్యమాలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రతిఒక్కరూ గ్రామీణ క్రీడలకు ప్రోత్సహం అందించాలన్నారు. యువత కూడా ఉత్సాహంగా పోటీల్లో భాగస్వాములు కావాలని కోరారు. కూటమి ప్రభుత్వం కూడా సంప్రదాయ క్రీడల పరిరక్షణకు ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. గ్రామీణ సంస్కృతిని భావి తరాలకు అందేలా చూసేందుకు కట్టుబడి ఉందని ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV