
తిరుమల , 29 డిసెంబర్ (హి.స.)
వైకుంఠ ఏకాదశి వేడుకలకు తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సోమవారం అర్థరాత్రి తర్వాత 1.30 గంటల నుంచి మంగళవారం రాత్రి 11.45 గంటల వరకూ.. సుమారు 20 గంటలపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. సామాన్యులకే తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. తొలిరోజు సుమారు 70 వేలమందికి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఏరోజు టోకెన్లు జారీ చేస్తే.. అదే రోజు దర్శనం చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఇందుకోసం ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను వినియోగించనున్నట్లు తెలిపింది.
దర్శనానికి కంపార్టుమెంట్లు, క్యూలైన్లలో ఉండే భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం వంటి 16 రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేయించనున్నట్లు టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకూ దర్శనాలు జరగనుండగా.. తొలి మూడు రోజులు 24 గంటలూ భక్తులకు అన్న ప్రసాదాలు, వేడి పానీయాలు, పిల్లలకు పాలు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. గదుల కేటాయింపు ఆటోమేటెడ్ సిస్టమ్ లో జరుగుతుందని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV