
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రైకార్ రుణాలను (Tricor Loans) ఆపి గిరిజనులకు అన్యాయం చేశారని రాష్ట్ర మాతా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) అన్నారు. తమ కూటమి ప్రభుత్వం ద్వారా గిరిజన రైతుల కోసం అన్ని ఐటీడీఏలకు (ITDA) ట్రైకార్ ద్వారా రూ.13.70 కోట్లను విడుదల చేశామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. మరోసారి ఐటీడీఏ ద్వారా 90 శాతం సబ్సిడీతో పరికరాలను గిరిజన రైతులకు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో గిరిజనులు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. గిరిజన కుటుంబాల జీవనోపాధి బలోపేతం చేసేందుకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. లబ్ధిదారులకు జీవనోపాధి కోసం వ్యవసాయ పరికరాల పంపిణి ద్వారా మేలు చేకూర్చేందుకు పని చేస్తున్నామని తెలిపారు.
గిరిజన రైతుల శ్రమ తగ్గించి ఉత్పాదకత పెంచేందుకు వారికి 90 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా వారి ఉత్పత్తులు మార్కెట్ కు సులభంగా చేర్చేందుకు ట్రక్కులను అందజేస్తున్నామని పేర్కొన్నారు. పంటలు, నిల్వ సామాగ్రి రక్షణ కోసం టార్పలిన్ కవర్లను గిరిజన రైతులకు ఇస్తున్నామన్నారు. వ్యవసాయ పనులు వేగంగా జరిగేందుకు ఆయిల్ ఇంజిన్లు మంజూరు చేస్తున్నామన్నారు. గిరిజన కుటుంబాల అదనపు ఆదాయం కోసం పెద్ద ఎత్తున గోకులాలు మంజూరు చేసి పశుపోషణకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతిఒక్క గిరిజన రైతుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV