
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర సమాచార కమిషన్‌లో (RTI) దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు మరో నలుగురు కమిషనర్ల ఎంపికను పూర్తి చేసింది. ఈ కీలక సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొని అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న వజ్జా శ్రీనివాసరావును ఎంపిక చేయాలని కమిటీ నిర్ణయించింది. గత కొంతకాలంగా ప్రధాన కమిషనర్ లేకపోవడంతో వేల సంఖ్యలో అప్పీళ్లు, ఫిర్యాదుల పెండింగ్ లో ఉన్నాయి. వాటి పరిష్కారానికి ఈ నియామకం ద్వారా మార్గం సుగమం కానున్నట్లు తెలుస్తోంది.
చీఫ్ కమిషనర్‌తో పాటు సమాచార కమిషనర్లుగా మరో నలుగురు ప్రముఖులను కమిటీ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు న్యాయవాద వృత్తికి చెందిన వారు కావడం విశేషం. అనంతపురం జిల్లాకు చెందిన గాజుల ఆదెన్న, కడప జిల్లాకు చెందిన రవి యాదవ్, విశాఖపట్నం జిల్లాకు చెందిన పి.ఎస్. నాయుడులను ఆర్టీఐ కమిషనర్లుగా ఎంపిక చేశారు. తాజాగా మాజీ పాత్రికేయుడు వీ.ఎస్.కె చక్రవర్తిని మరో కమిషనర్‌గా ఖరారు చేశారు. మొత్తం 200కు పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, చట్టం పట్ల అవగాహన, సామాజిక స్పృహ ఉన్న వీరిని ప్రభుత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసిన ఈ పేర్లను త్వరలోనే గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. గవర్నర్ ఆమోద ముద్ర పడిన వెంటనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలియవస్తోంది. ఈ కొత్త కమిషనర్ల రాకతో రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మరింత పటిష్టంగా అమలు కావడమే కాకుండా, పౌరులకు సకాలంలో సమాచారం అందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV