
విశాఖ, 29 డిసెంబర్ (హి.స.)
: విశాఖపట్నం పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా మహిళా ఐఏఎస్ అధికారిణి రోష్ని అపరాంజి కోరాటి (ఐఏఎస్) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖ పోర్టులో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కావడం విశేషం. అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన ఆమె తన విద్యాభ్యాసమంతా విశాఖలోనే పూర్తి చేశారు. ఆమె తండ్రి విశాఖపట్నం పోర్టు హై స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. తండ్రి సేవలు అందించిన సంస్థకు కుమార్తె డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
ఏప్రిల్ 3, 1984లో జన్మించిన రోష్ని.. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఆమెకు విస్తృత పరిపాలనా అనుభవం ఉంది. అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు అదనపు ఉప కమిషనర్‌గా, అదే జిల్లాకు కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా సేవలందించారు. విశాఖ పోర్టు అథారిటీకి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులవడానికి ముందు డిప్యుటేషన్‌పై విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ)లో జాయింట్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. 2018లో ప్రజా పరిపాలనలో విశిష్ట సేవలకుగాను ప్రధాని అవార్డు సహా అనేక పురస్కారాలు అందుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ