
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో సహచర మంత్రి మహ్మద్ అజారుద్దీన్, జూబ్లీ హిల్ల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, స్మశానవాటికలు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా మైనార్టీలు స్మశాన వాటికలు లేక ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యను వీలైనంత త్వరితగతిన రక్షణశాఖ, రెవెన్యూ, వక్ఫ్‌బోర్డ్ సమన్వయంతో అధిగమించాలని అధికారులకు సూచించారు.
అవసరమైన చోట రెవెన్యూ భూమిని రక్షణశాఖకు బదలాయించి వారి నుంచి ప్రత్యామ్నాయంగా భూమి తీసుకోవాలని, అలాగే రెవెన్యూ భూమిని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని సూచించారు.
పేదల సంక్షేమం, ప్రజా అవసరాలు, అభివృద్ది కార్యక్రమాల కోసం వినియోగించవలసిన ప్రభుత్వ భూములను కొద్దిమంది స్వార్ధప్రయోజనాల కోసం కబ్జాపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారని, ఇటువంటి వాటిని ఎట్టిపరిస్దితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఆక్రమణలను గుర్తించిన వెంటనే నోటీసులు జారీ చేసి అవసరమైతే ఖాళీ చేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని వివాదాల్లో ఉన్న భూముల పరిరక్షణకు న్యాయపరంగా గట్టిగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు.
ఈ సమావేశంలో TMREIS వైస్ ఛైర్మన్ ఫహీం ఖురేషి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీల్లాహ్, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు